హారతి సమయంలో గంట ఎందుకు కొడతారు ?

పుణ్యక్షేత్రాల్లోకి, గుళ్లలోకి, దేవాలయాలకు వెళ్లినప్పుడు దేవుడికి ఎదురుగా కనిపించేది గంట. చిన్న గుడిలో అయినా.. గంట ఖచ్చితంగా ఉంటుంది. దేవుణ్ని స్మరించుకుంటూ.. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి… గంట కొట్టడం భక్తులకు అలవాటు . గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గంట కొడతారు. అలాగే గుళ్లో దేవుడికి హారతి ఇచ్చినప్పుడు కూడా గంట కొడతారు. అసలు గంట ఎందుకు కొడతారు ? అనే సందేహం చాలా మందికే ఉంటుంది.. ఆలయ గంటలో అనేక అర్థాలు, పరమార్థాలున్నాయి. దుష్టశక్తులను దూరం చేసే శక్తి గంటలలో ఉంది. అలాగే దేవాలయంలో గంట మోగిస్తే.. సకల శుభాలకు సంకేతంగా భావిస్తారు. ప్రత్యేక పూజల సమయంలో గంట కొడితే.. మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. గంటలో ప్రతి భాగానికి చాలా ప్రత్యేకత ఇమిడి ఉంది. గంట నాలుకలో సరస్వతీదేవి కొలువై ఉంటుందని, గంట ముఖభాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రుడు, కొనభాగంలో వాసుకి, పిడి భాగంలో ప్రాణశక్తి ఉంటుందని.. అందుకే గంటను దైవస్వరూపంగా భావిస్తారు. అలాగే పిడిభాగం గరుడ, చక్ర, హనుమ, నంది మూర్తులతో దర్శనమిస్తుంది. కంచుతో తయారు చేసిన గంటను కొట్టినప్పుడు ఓం అనే స్వరం వినిపిస్తుంది. ఈ నాదం మనలోని చింతలు, సమస్యలను తొలగించి, మనసుని దేవుడిపై ఆధ్యాత్మిక భావన కలిగేలా చేస్తుంది. అలాగే గంట కొట్టడం వల్ల నలుదిక్కులా ఆ శబ్ధం వ్యాపించి దుష్టశక్తులను దూరంగా తరిమే శక్తి ఉంటుంది. కొన్ని ఆలయాల్లో గుత్తులు, గుత్తులుగా ఒకేతాడుకి కొన్ని గంటలను తగిలించి ఉంటుంది. అయితే ఈ గంటలు అలంకారప్రాయమే కానీ.. ఎలాంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉండదు. అలాగే హారతి సమయంలో గంట ఎందుకు కొడతారు అన్న సందేహం చాలా మందికి రావచ్చు. దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికి హారతి సమయంలో గంట కొడతారు. అంటే.. ఆలయంలో దేవుడి విగ్రహంలోకి సకలదేవతలను ఆహ్వానించడం. అందుకే.. హారతి సమయంలో.. ఆ వెలుగులో స్వామిని చూపిస్తారు. కాబట్టి హారతి ఇచ్చే సమయంలో కళ్లు మూసుకోకుండా.. దేవుడిని ప్రత్యక్ష దైవాంశ రూపంగా దర్శించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *